What is Law of Karma? (in Telugu) కర్మ సిద్ధాంతం

ఏ మనిషైనా కోరుకునేది ఒక్కటే.. ఎలాంటి కష్టాలు, బాధలు లేని జీవితం..

అయితే, కోరుకున్న ఉద్యోగం వస్తేనో, కావలసినంత డబ్బు సంపాదిస్తేనో మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకోవడం పెద్ద పొరపాటు..

మన ఆలోచనా విధానం, చేసే పనులు.. ఈ రెండిటి ఆధారంగానే, మన జీవితం నిర్ణయించబడి ఉంటుంది..

ఈ నిజాన్ని అద్భుతంగా వివరించే ఒక ఆధ్యాత్మిక నమ్మకమే కర్మ సిద్ధాంతం.

ఇంతకీ కర్మ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..



ఒకరి కోరికలను బట్టే, వారి చేష్టలు ఉంటాయి.. చేష్టలను బట్టే అలవాట్లు ఉంటాయి.. అలవాట్లను బట్టే ప్రవర్తన ఉంటుంది.. ఆ ప్రవర్తనే అతని జీవితాన్ని మారుస్తుంది...

కనుక ఒక వ్యక్తి ఎలంటివాడు, అతని జీవితం ఎలా ఉండబోతోంది అన్నది, అతని కోరికలను బట్టి చెప్పొచ్చు..

మన జీవితంలో ప్రస్తుతం జరిగే ప్రతిదానికీ కారణం, మనం గతంలో చేసిన ఆలోచనలు, ఎంపికలు, పనులు, ఇంకా చేష్టలు..

కర్మ అనే పదానికి అర్థం... పని, అలవాటు లేదా చేష్ట.

ఇది దేవుడికి సంబంధించిన విషయం కాదు.. మానవ జీవితం, ఇంకా నైతిక విలువలకు సంబంధించింది..

అయితే, మనం చేసే అన్ని పనులూ కర్మలు కావు.. కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన పనులు మాత్రమే కర్మలవుతాయి.

మన జీవితాలలో ఇదివరకే జరిగినది, ప్రస్తుతం జరుగుతున్నది, ఇకమీదట జరగబోయేది మన కర్మల మీదే ఆధారపడి ఉంటాయి..

కర్మ సిద్ధాంతం అన్ని మతాలలో, అనేక విధాలుగా వివరించబడింది.

ఒక వ్యక్తి యొక్క చావు పుట్టుకలు, పునర్జన్మ వంటివి వారి యొక్క కర్మల మీదే ఆధారపడి ఉంటాయని, హిందూమతంతో పాటూ అనేక మతాలవారు నమ్ముతారు...

ఒకరు సక్రమంగా ఆలోచిస్తూ, వారి పనులను నిస్వార్థంగా చేస్తే.. వారి జీవితం సక్రమంగా, సుఖంగా ఉంటుందని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

చెడ్డ ఆలోచనల వల్ల, స్వార్థ కుతంత్రాలతో చేసే పనుల వల్ల, జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని కూడా కర్మ సిద్ధాంతం హెచ్చరిస్తుంది.

ఇంకో విధంగా చెప్పాలంటే.. మనం ఏదైతే ఇస్తామో, అదే తిరిగి తీసుకుంటాం...

బౌద్ధమతం ప్రకారం, కర్మల యొక్క ప్రభావం జీవితంపై రెండు విధాలుగా ఉంటుంది... మొదటిది ఫలం, రెండోది సంస్కారం..

ఉదాహరణకు, మీరు ఒక వ్యక్తికి సహాయపడ్డారు అనుకుందాం.. వెంటనే ఆ వ్యక్తి మీకు కృతజ్ఞతలు చెప్పి మిమ్మల్ని సంతోష పెడతారు. దీన్ని కర్మ ఫలం అంటారు..

దీనివల్ల మీ ఆలోచనా పద్ధతి, ప్రవర్తనల్లో మార్పులొస్తాయి.. ఇకనుండీ మరింత మందికి సహాయపడాలన్న భావన మీలో కలుగుతుంది.. దీన్నే సంస్కారం అని అంటారు..

ఈ విధంగా, ఒక వ్యక్తి యొక్క కర్మలు అతని వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని నిరంతరం మారుస్తూ ఉంటాయి...

ఒక వ్యక్తి, తాను పండించిన పంట తానే తిన్నట్లు, తాను చేసిన కర్మలకు కూడా తానే ప్రతిఫలం అనుభవిస్తాడని, భగవద్గీతలో చెప్పబడింది..

తలరాతను బట్టి జీవితం నడవదని, అదే నిజమైతే మనిషిజన్మకు అర్థమే లేకుండా పోతుందని కూడా, భగవద్గీతలో ఉంటుంది.

కాబట్టి, మన సంతోషాలకు మనమే కారణం... మన కష్టాలకు కూడా కారణం మనమే..

కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే, అది మనల్ని ధర్మంవైపు నిలబడేలా చేస్తుంది..

అది మనకు ఏది మంచి, ఏది చెడు అన్నది తెలిసేలా చేస్తుంది....


Popular posts from this blog

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?