What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?
ఒక వ్యక్తి చట్టపరమైన నేరం చేస్తే అరెస్టు కాబడడం సహజం... అయితే, ఒకవేళ ఎలాంటి నేరం చేయకపోయినా అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది?
పోలీసులకు తలచుకుంటే ఎవరినైనా అరెస్టు చేయగలిగే అధికారం ఉంటుందా?
ఒకవేళ మనం కూడా ఎప్పుడైనా అన్యాయంగా అరెస్ట్ అయితే ఏవిధంగా న్యాయం పొందాలి?
మన భారత రాజ్యాంగంలో పొందుపరచిన 22వ ఆర్టికల్ ఏం చెబుతుంది, ఇంకా 'హెబియస్ కార్పస్' (HABEAS CORPUS) అనే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మన భారతదేశ రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ అనుసారం, ప్రతి వ్యక్తికీ సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది.
ఇష్టానుసారంగా ప్రజల స్వేచ్చను హరించగలిగే అధికారం లేదా నిర్బంధించే హక్కు ఏ సంస్థలకూ, అధికారులకూ లేదు.
21వ ఆర్టికల్ కు బలం చేకూరే విధంగా 22వ ఆర్టికల్ ఇంకా 'హెబియస్ కార్పస్' అనే విధానాన్ని రాజ్యాంగంలోని 226వ ఆర్టికల్ లో చేర్చారు..
పోలీసులు గానీ వేరే ఇతర అధికారులు గానీ, ఒకరిని ఏ కారణం వల్లైనా అరెస్ట్ చేయాల్సి వస్తే, అలా చేసిన వెంటనే లేదా 24 గంటలలోపు సదరు వ్యక్తిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టవలసి ఉంటుంది.
దీనివల్ల ఒక వ్యక్తి చట్టపరంగానే అరెస్టు కాబడ్డాడా, లేక అన్యాయంగా అతన్ని అరెస్టు చేశారా అనే విషయం న్యాయస్థానానికి తెలుస్తుంది.
ఒకవేళ అధికారులు తాము చేసిన అరెస్టు గురించి న్యాయస్థానానికి సరైన వివరణ ఇవ్వలేనట్లైతే, వెంటనే సదరు వ్యక్తిని విడుదల చేయవలసిందిగా కోర్టు ఆజ్ఞను ఇస్తుంది..
దీన్నే హెబియస్ కార్పస్ వ్రిట్ అని పిలుస్తారు..
'హెబియస్ కార్పస్' అనే పదానికి అర్థం, ఒక మనిషిని చట్టపరంగా నిర్బంధించడం లేదా ఒకరి శరీరంపై చట్టపరంగా హక్కును కలిగి ఉండటం.
మనుషుల స్వేచ్ఛను కాపాడే విషయంలో హెబియస్ కార్పస్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
భారతదేశంలో హెబియస్ కార్పస్ ఆర్డర్ ను జారీ చేసే అధికారం హై కోర్ట్లు ఇంకా సుప్రీమ్ కోర్టుకు ఉంటుంది.
అన్యాయంగా అరెస్టు కాబడిన బాధితులకు తగిన పరిహారాన్ని పొందగలిగే అవకాశాన్ని కూడా హెబియస్ కార్పస్ కల్పిస్తుంది.
హెబియస్ కార్పస్ పిటిషన్ వెయ్యడానికి ఎలాంటి నియమనిబంధనలు ఉండవు.
ఒకరు అన్యాయంగా అరెస్టు అయ్యారని అనిపిస్తే, సదరు వ్యక్తి తరపున ఎవరైనా హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వెయ్యవచ్చు..
ఐతే, మన దేశపు వ్యక్తులు ఒకవేళ ఏ ఇతర దేశంలోనైనా అరెస్టు కాబడితే, వారి తరపున ఇక్కడ మనం హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం కుదరదు.