What is Buddhism? (Explained in Telugu) • బౌద్ధ తత్వం ఏం చెబుతోంది?
బౌద్ధ మతం లేదా buddhism ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద మతాచారంగా గుర్తింపు పొందింది. సుమారు 52 కోట్ల మంది బౌద్ధ మత సూత్రాలను అనుసరిస్తున్నారు.
బౌద్ధ మతం అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది, ధ్యానంలో ఉండే గౌతమ బుద్ధుని నిర్మలమైన స్వరూపం...
మనం బౌద్ధ మతం గురించి, ఆ మతం ప్రపంచానికి ఇస్తున్న సందేశం గురించీ తెలుసుకోబోయే ముందు 'ధర్మం' అనే శబ్దానికి అర్ధాన్ని తెలుసుకోవాలి. ధర్మం అంటే మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు, వాటిలో సరైనదాన్ని ఎలా ఎన్నుకోవాలో తెలుసుకోవడం. ఏ ఒక్కరికీ హాని కలిగించని సరైన నిర్ణయాలు తీసుకోవడం. ధర్మాన్నే ఆధారంగా చేసుకొని నిరాడంబరమైన జీవితాన్ని లేదా simple లైఫ్ ని అనుసరించమని తెలిపే మతమే బౌద్ధ మతం.
బౌద్ధ ధర్మం, ధర్మ వినయం, buddhism.. ఇలా ప్రస్తుతం మూడు పేర్లతో ఈ మతం ప్రపంచమంతా వ్యాపించింది... బౌద్ధ ధర్మం భారతదేశానికి చెందిన ఒక ప్రాచీనమైన మతం. ఇది పూర్తిగా గౌతమ బుద్ధుడు అనే మహా జ్ఞాని చేసిన హితబోధల ఆధారంగా స్థాపించబడింది. 'బుద్ధ' అనే పదానికి అర్ధం.. జ్ఞానం. బౌద్ధ మతం పూర్తిగా జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది.
బౌద్ధ ధర్మం ప్రకారం, ఈ ప్రపంచం పూర్తిగా సమస్యలతోనూ, భావోద్వేగాలతోనూ, అంతులేని ఆలోచనలతోనూ నిండి ఉంది. తద్వారా ప్రపంచంలో ఎదిగే మనిషి జీవితం నిత్యం సుఖాలు దుఃఖాలనేవాటితో బంధించబడి ఉంటుంది. కామం, కోపం, బాధ, ఆకలి, పుట్టుక, చావు... ఇలా రకరకాల విషయాలు జీవితంలో మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాయి. ఇటువంటి బంధాలు, భావోద్వేగాల నుండీ మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చి, మనకి అవసరమైన జ్ఞానాన్ని ప్రశాంతతని పొందే మార్గాలను బౌద్ధ మతం చూపిస్తుంది.
బౌద్ధ ధర్మాన్ని అనుసరించేవాళ్ళను 'బౌద్ధులు' అని అంటారు. ప్రపంచంలో అధిక శాతం మంది నమ్మే 'కర్మ' అనే సిద్ధాంతాన్నిమొదటిగా పరిచయం చేసింది బౌద్ధ ధర్మమే.. మన తలరాత ఏ దేవుడు రాయలేదని, అది కేవలం మనం చేసిన పూర్వ కర్మలమీద ఆధారపడి ఉంటుందని కర్మ సిద్ధాంతంలో తెలుపబడింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే domino effect లా అన్నమాట! ఎప్పుడో మనం గతంలో చేసిన ఒక చిన్న పని మన భవిష్యత్తుని నిర్ణయించగలదని బౌద్ధులు నమ్మే కర్మ సిద్ధాంతం చెబుతుంది. ప్రతి ఒక్కరి జీవితం వారి కర్మానుసారం ఉంటుందని బౌద్ధ ధర్మం చెబుతుంది. అలాగే మన జీవితంలో జరిగే ప్రతి దానికీ ఒక కారణం ఉంటుందని, కారణం లేకుండా ఏ పనీ ఈ విశ్వములో జరగదని బౌద్ధం నమ్ముతుంది.
బౌద్ధ ధర్మంలో ప్రధానంగా నాలుగు అంతిమ సత్యాలు తెలుపబడతాయి.
మొదటిది, దుఃఖం లేదా అంతులేని బాధ. ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. ఈవాళ మనం గడుపుతున్న జీవితం ఇలానే ఎప్పటికీ కొనసాగదు. జీవితంలోకి అనేక విషయాలు వస్తూ పోతూ ఉంటాయి. అయినా కూడా ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషీ తనని తాను వేరే వాళ్ళతో పోల్చుకుంటూ, తన జీవితంలో ఉన్న లోటుపాట్లను తలచుకుంటూ, తన దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ, ఉన్నవాటితో సంతృప్తి చెందకుండా అదే పనిగా తనని తాను ఇబ్బంది పెట్టుకుంటాడు. అశాశ్వతమైన విషయాల ద్వారా సంతోషాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరికి దుఃఖాన్ని మాత్రమే పొందుతాడు. మనిషి దుఃఖం నుండీ శాశ్వతమైన విముక్తిని కేవలం 'నిర్వాణం' అనే మార్గంలో వెళ్లడం ద్వారానే పొందగలడు. సుఖ దుఃఖాలకు అతీతంగా బౌద్ధులు ఈ మార్గంలో జీవించడానికి ప్రయత్నిస్తారు.
రెండవది, అంతులేని ఆశ. ఆశ జీవుణ్ణి నడిపిస్తుంది. అన్ని విధాలుగా ఎదిగి ఎన్నో విజయాలు సాధించేలా చేస్తుంది. అదే ఆశ చివరికి తన దుఃఖానికి కూడా కారణం అవుతుందని బౌద్ధ ధర్మంలో తెలుపబడింది. శరీరంలోని ఇంద్రియాలు ఎప్పుడైతే అనేక రకమైన అనుభూతులకు గురవుతాయో, ఆ అనుభూతులే కొన్నాళ్ళకి కోరికలగా మారతాయి. కోరికలు అలవాట్లగా మారతాయి. ఆ అలవాట్లు జీవుణ్ణి అదే పనిగా ఒక వస్తువుకో, విషయానికో లేదా మనిషికో బానిసను చేస్తాయి. తీరని కోరికలే మనిషిని పిశాచాల్లాగా పట్టి పీడిస్తాయి.
మూడోది, నిరోధం లేదా క్రమశిక్షణ. ఇంద్రియాలకు వశమవకుండా వాటిని అదుపు చేయడం, సరైన నడవడిక, మంచి ప్రవర్తన, సరైన ఆలోచనా విధానం ఇంకా అందమైన మాటతీరు అలవాటు చేసుకోవడం ద్వారా మనిషి ఆశలను జయించి, తద్వారా దుఃఖాన్ని జయించగలడని ఈ సత్యం చెబుతోంది.
నాల్గవది, అష్టాంగ మార్గం. ఎటువంటి మనిషైనా భావోద్వేగాలను జయించడానికి, ప్రశాంతతను పొందడానికీ ఎనిమిది గొప్ప మార్గాలు ఉంటాయి. ఉన్నది ఉన్నట్టుగా గమనించడం, అందరికీ మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం, సున్నితంగా మాట్లాడడం, వినయంగా ఉండడం, ధర్మంగా సంపాదించడం, ధర్మంగా నడుచుకోవడం, మేలు చేసే ఆలోచనలు చేయడం, ఇంకా ఏకాగ్రతతో బుద్ధిని నడపడం.
ఈ లక్షణాలు ఒక మనిషిని క్రమంగా సుఖ దుఃకాలకు దూరంగా ఉంచి, చివరికి నిర్వాణాన్ని లేదా ముక్తిని పొందేలా చేస్తాయి. బుద్ధుడు చెప్పిన హితబోధలను తరువాతి తరాలకు అందించే ప్రయత్నం చేయడానికి బౌద్ధులు ప్రపంచమంతటా వివిధ సంఘాలుగా కలిసి పనిచేస్తున్నారు.
చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో buddhism మంచి ప్రాముఖ్యత పొందింది. గౌతముడు జ్ఞానోదయాన్ని పొంది బుద్ధుడిగా అవతరించిన చోటు మన భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రాంతాన్ని 'బోధ్ గయా' ఇంకా 'మహాబోధి' అనే పేర్లతో బౌద్ధులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.
మన ఆంధ్ర ప్రదేశ్ లో బొజ్జన్నకొండ, రామతీర్థం, అమరావతి ప్రాంతాలు బౌద్ధ స్తూపాలు విలసిన ప్రదేశాలుగా ప్రఖ్యాతి గడించాయి.